14, ఏప్రిల్ 2010, బుధవారం

అయినా కాంక్ష తీరలేదు

అపుడెపుడో... అనగా... అనగా... మానవుడు సమూహాల్లో సభ్యుడుగా ఉన్న రోజుల్లో... ఓ సమూహం నుండి మరో సమూహానికి సమాచారం అందించుకోవడం కోసం పావురాలతో ఉత్తరాలు బట్వాడా చేయించుకున్నపుడు... ఆ తర్వాత గుర్రాలపై వందలకొద్దీ మైళ్ళ దూరం వెళ్లి... సమాచారం అందించు కోవాల్సివచ్చినపుడు... ఇంకా వేగంగా కబురందించుకునే దారేమిటా అని మన తాత ముత్తాతలు ఆలోచించే ఉంటారు కదా!

ఉత్తరాల బట్వాడా కాలం వచ్చాక ...

ఓ లేఖ రాసి, అది అవతలి వారికి చేరి రెండు...మూడు...నాలుగైదు రోజులు... జవాబు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన మన కాలంలో మరింత వేగంగా క్షేమ సమాచారాన్ని తెలుసుకునే మార్గాన్ని అన్వేషించారు కదా!

గ్రాహంబెల్ దూరవాణిని కనుగొన్నాక...

హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకుని, సంబరపడిపోయిన మన పెద్దలు ఆ తర్వాత కొన్నాళ్లకే ట్రంక్ కాల్ బుక్ చేసి, గంటల కొద్దీ నిరీక్షణ భరించ లేక ఇంకా త్వరగా ఫోన్ లైన్ కలిసే పధ్ధతిని కనుక్కుంటే బాగుండని ఆతృత చెందే వుంటారు.

ట్రంక్ కాల్ పోయి... ఎస్టీడి వచ్చాక...

అత్యవసర ఫోన్ సమాచారం అవసరమైనపుడు, గంటల కొద్దీ ఫోన్ ఎదురుగా కూర్చున్న క్షణాల్లో ఎక్కడికి వెళితే అక్కడే ఫోన్ అందుబాటులో వుంటే ఎంత బాగుండో... అని నిట్టూర్చే వుండి వుంటారు... మరి మీరేమంటారు ?

మొబైల్ వచ్చి... ఆ కాస్త అవసరం తీర్చాక... ఎక్కడైనా, ఎప్పుడైనా గంటల కొద్దీ మాట్లాడడం మొదలెట్టాక... ఆ సెల్ కు ఓ వైర్ తగిలించి దాని బటన్ ను చెవిలో నొక్కిపెట్టి, చేతుల నొప్పి తగ్గించుకున్నామా ! ఇంతలోనే బ్లూటూత్ వచ్చి ఆ వైర్ అడ్డంకినీ తొలగించిందా !

అయినా...

ఇంకా ఏదో అసౌకర్యం. అది కూడా మహిళలకే ఎక్కువ. ఇంటా బయటా విధులు నిర్వర్తించే మహిళకు వంట గదిలో వుండగా ఫోన్ వస్తే... ఎంత అసౌకర్యం? చుడీదార్ వున్న మహిళలైతే దానిక్కాస్త జేబు కుట్టించేస్తే కొంతలో కొంత బెటరే. మరి సంప్రదాయకమైన చీరల్లో ఉండే మహిళలైతే...?

రెండు చేతులతో వంట గదిలో కుస్తీపడుతూ, భుజానికీ, చెవికీ మధ్య సెల్ ను ఇరికించుకుని, ఎంత అవస్థయో కదా...

ఈ సౌకర్యం గురించి ఇపుడు అతివలే ఎక్కువగా ఆలోచిస్తున్నారు...దానిక్కూడా ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు పరిష్కారం కనుగొనే వుంటారులే... వెంటనే తెలుసుకుందాం.

ఇదంతా సరే... అవసరాల కోసం మనం కల్పించుకుంటున్న ఈ సౌకర్యాలలో మానవ విలువల్ని, సమిష్టి తత్వాన్ని పెంచుకుంటున్నామా? తుంచుకుంటున్నామా? ఆలోచించే సమయం వచ్చేసింది...ఆలోచిద్దామా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి