17, మే 2015, ఆదివారం

పూపొదరిల్లు..

జనారణ్యంలో ఆ ఇల్లు
పూపొదరిల్లై శోభిస్తూనే ఉంటుంది..
తన ప్రేమికుల హృదయానందమై
ప్రకృతి పరవశిస్తూనే ఉంటుంది..
పచ్చని ఆ పొదరింట
తమ సొగసుకు తామే మురిసిపోతూ
రోజాలు రాగరంజితమౌతాయి..


జాజిమల్లి పరిమళాలను
రేరాణి గమ్మత్తుగా కవ్విస్తుంది..
వాటిని చిత్తు చేస్తూ సంపెంగ
మురిపెంగా నవ్వుతుంది..
వాటి మధ్య తమ అందాలను
గొప్పగా చాటుకుంటాయి కొత్త తరం పూబాలలు
వాటన్నిటినీ ప్రేమగా సాకుతూ
నీటి పాత్రతో ఆప్యాయంగా
తమను పిలిచే అమ్మను చూసి
కిచకిచమంటూ వచ్చి వాల్తాయి పక్షులు..
ఆ ముచ్చటకు మురిసిపోతూ
గెంతులు వేస్తాయి ఉడుతలు..
అక్కడే పూబాలలతో పరాచకాలాడుతూ
మకరందాన్ని గ్రోలి
ముచ్చటగా విన్యాసాలు చేస్తాయి సీతాకోకలు..
తమకూ గూడునిచ్చిన
ఆ పొదరింటి యజమానులకు
తీయగా ధన్యవాదాలు చెప్పి
తుట్టెను పెట్టుకుంటాయి తేనెటీగలు..


ఆ ఇంట పుష్పాలై
ప్రేమ ఫలిస్తూనే ఉంటుంది..
ఆ ఇంట నిత్య వసంతుడు కొలువై ఉంటాడు..
సప్తవర్ణ రాగాలు
తరంగాలై ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి..
పదుగురికోసం పరితపించే మనసులు
స్నేహపరిమళాలు వెదజల్లుతూనే ఉంటాయి..

అక్కడ వెన్నెలలు వర్షించడం
చందురుడికి ఎంతో ఇష్టం..
ఆ ఇంట ఒక్క రోజైనా గడపటం
మా ఇంటిల్లపాదికీ ఇష్టం..

-పద్మ!

18, ఏప్రిల్ 2010, ఆదివారం

కూర్గ్ అందాలు

మెత్తగా హత్తుకున్న ఒత్తైన మేఘ మాలికల్లో
చల్లగా ఒదిగిపోయిన
పచ్చని కొండలు ...
చిత్తైపోయిన మనసుల్ని
గమ్మత్తుగా తట్టిలేపే
వింతైన పరిమళాలు...

నీలగిరి కొండల చల్లదనం...
తెక్కడి, కొడైకెనాల్ అందాలను
అపురూపంగా ఇముడ్చుకున్న
కొండకోనల కూర్గ్ సోయగాలు

తనివితీరా చూసి...
గుండె గదుల్లో భద్రపరచుకుని
అనుభూతుల జలపాతపు సవ్వడిలో
డిసెంబర్ 26 , 27

బాధ్యతల బరువుల్లో
ఒంగిపోతూ కుంగిపోతూ
అలసిన మనసులను
సేద తీర్చే సుందర మనోహర దృశ్యాలు
మనో:ఫలకంపై జీవిత కాలపు గాఢ ముద్రలు...

క్షణక్షణం

ముందు ఏనుగు...
వెనుక పులి...
మధ్య - మద్యం మత్తులో
అటవీ అధికారుల  అనాగరికపు చిందులు...
చిక్కని అడవుల్లో ఓ రాత్రి...
రోమాలు నిక్కబోడిచే హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా...
మధుమలైలో క్రూర మృగాల జాడలు...
బందీపురాలో ఏనుగుల ఘీంకారవాలు...
గడచిన కాలపు వీరప్పన్ భీకర గాథలు...
దండకారణ్యాల్లో రేయంతా గుండె గుప్పిట్లో...
తెల్లవారితే ...
రొమ్ము విరిచి సాహస యాత్రీకుల్లా
విహార యాత్రలో అనుకోకుండా ఓ రోజు ... 25, డిసెంబర్ 2009

14, ఏప్రిల్ 2010, బుధవారం

అయినా కాంక్ష తీరలేదు

అపుడెపుడో... అనగా... అనగా... మానవుడు సమూహాల్లో సభ్యుడుగా ఉన్న రోజుల్లో... ఓ సమూహం నుండి మరో సమూహానికి సమాచారం అందించుకోవడం కోసం పావురాలతో ఉత్తరాలు బట్వాడా చేయించుకున్నపుడు... ఆ తర్వాత గుర్రాలపై వందలకొద్దీ మైళ్ళ దూరం వెళ్లి... సమాచారం అందించు కోవాల్సివచ్చినపుడు... ఇంకా వేగంగా కబురందించుకునే దారేమిటా అని మన తాత ముత్తాతలు ఆలోచించే ఉంటారు కదా!

ఉత్తరాల బట్వాడా కాలం వచ్చాక ...

ఓ లేఖ రాసి, అది అవతలి వారికి చేరి రెండు...మూడు...నాలుగైదు రోజులు... జవాబు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన మన కాలంలో మరింత వేగంగా క్షేమ సమాచారాన్ని తెలుసుకునే మార్గాన్ని అన్వేషించారు కదా!

గ్రాహంబెల్ దూరవాణిని కనుగొన్నాక...

హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకుని, సంబరపడిపోయిన మన పెద్దలు ఆ తర్వాత కొన్నాళ్లకే ట్రంక్ కాల్ బుక్ చేసి, గంటల కొద్దీ నిరీక్షణ భరించ లేక ఇంకా త్వరగా ఫోన్ లైన్ కలిసే పధ్ధతిని కనుక్కుంటే బాగుండని ఆతృత చెందే వుంటారు.

ట్రంక్ కాల్ పోయి... ఎస్టీడి వచ్చాక...

అత్యవసర ఫోన్ సమాచారం అవసరమైనపుడు, గంటల కొద్దీ ఫోన్ ఎదురుగా కూర్చున్న క్షణాల్లో ఎక్కడికి వెళితే అక్కడే ఫోన్ అందుబాటులో వుంటే ఎంత బాగుండో... అని నిట్టూర్చే వుండి వుంటారు... మరి మీరేమంటారు ?

మొబైల్ వచ్చి... ఆ కాస్త అవసరం తీర్చాక... ఎక్కడైనా, ఎప్పుడైనా గంటల కొద్దీ మాట్లాడడం మొదలెట్టాక... ఆ సెల్ కు ఓ వైర్ తగిలించి దాని బటన్ ను చెవిలో నొక్కిపెట్టి, చేతుల నొప్పి తగ్గించుకున్నామా ! ఇంతలోనే బ్లూటూత్ వచ్చి ఆ వైర్ అడ్డంకినీ తొలగించిందా !

అయినా...

ఇంకా ఏదో అసౌకర్యం. అది కూడా మహిళలకే ఎక్కువ. ఇంటా బయటా విధులు నిర్వర్తించే మహిళకు వంట గదిలో వుండగా ఫోన్ వస్తే... ఎంత అసౌకర్యం? చుడీదార్ వున్న మహిళలైతే దానిక్కాస్త జేబు కుట్టించేస్తే కొంతలో కొంత బెటరే. మరి సంప్రదాయకమైన చీరల్లో ఉండే మహిళలైతే...?

రెండు చేతులతో వంట గదిలో కుస్తీపడుతూ, భుజానికీ, చెవికీ మధ్య సెల్ ను ఇరికించుకుని, ఎంత అవస్థయో కదా...

ఈ సౌకర్యం గురించి ఇపుడు అతివలే ఎక్కువగా ఆలోచిస్తున్నారు...దానిక్కూడా ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు పరిష్కారం కనుగొనే వుంటారులే... వెంటనే తెలుసుకుందాం.

ఇదంతా సరే... అవసరాల కోసం మనం కల్పించుకుంటున్న ఈ సౌకర్యాలలో మానవ విలువల్ని, సమిష్టి తత్వాన్ని పెంచుకుంటున్నామా? తుంచుకుంటున్నామా? ఆలోచించే సమయం వచ్చేసింది...ఆలోచిద్దామా!

12, ఏప్రిల్ 2010, సోమవారం

కష్టాలు

-->
మొన్న... కన్నీటి వరద
నిన్న... నీరింకిన బురద
నేడు... వ్యాధుల బెడద
కోలుకోని కష్టం... కృష్ణా తీరం

ఎడారి భూములు
ఎండిన గుండెలు
జలం లేదు... ఫలం లేదు
జనులు జీవచ్ఛవాలు
( మోడు ) బీటలు వారింది ' మెట్ట ' జీవితం
పెరిగి విరిగిన రెక్కలు

ఆవిరైన ఆశలు
అంతస్థుల వెక్కిరింతలు
భూ(మి)మ్ ని విడిచిన సాములో
"రియల్" కష్టాలు

విశ్వ విపణిలో
వ్యక్తిత్వం... రెక్కల కష్టం
"నిశి" రాతిరి కరెన్సీ వెలుగులు
కమ్మిన మాంద్యం మబ్బుల "ఐ.టి." తళుకులు

అవనిలో సగం...
అభద్రతే జీవితం
కుత్తుకలు కత్తిరించే
కత్తుల దారుల్లో
జీవితమొక రణం...
ఆత్మరక్షణలో ఆడబ్రతుకు

కష్టం లేని చోటు
కాగడా వేసి వెదికినా దొరకదు
నిరాశల ఉరితాళ్ళు, విషం డబ్బాలు
కావేవీ విషమ సమస్యకు పరిష్కారాలు

కాదు బ్రతుకు వృధా
కాకూడదు కన్నీటి వ్యధ
శోధించి సాధించడమే
ధీరగుణం అనలేదా మహాకవి...

10, ఏప్రిల్ 2010, శనివారం

వాడే

బి పాజిటివ్ ...
చెబుతూనే వుంటాడు
పదే.. పదే..
అనుమానపు అద్దాల్లోంచి
తొంగి చూస్తూ ... వాడు

బి కూల్ ...
శాంతింపజేస్తూనే వుంటాడు
అదేపనిగా
రాజేసిన అగ్నికి
ఆజ్యం పోస్తూ వాడే ...

ప్రూవ్ ... యువర్ సెల్ఫ్ ...
హితబోధ చేస్తుంటాడు
అనుక్షణం
ఆరోపణాస్త్రాలను సంధిస్తూ
అసహనంగా అతడే...

అవన్నీ మరచిపో..
సానుకూలత..ప్రశాంతత..
నిబద్ధత.. నీవైతే
నీ దారిన నువ్వు సాగిపో...
నీ మనసుకు నువ్వే జవాబుదారి

నీకు తెలియనివి
నా నుంచి నేర్చుకో
- ఓ అజ్ఞాని బోధ

విశాల విశ్వాన్ని చూడు
ఎంత ఉద్గ్రంథమో!
- ఓ వివేకి జ్ఞాన బోధ

ఆకాశంపై ఉమ్మి...
అహంకారి ఆనందం
అవనికి శిరస్సు వంచి...
ఆదర్శ మూర్తి ఆకాశమంత ఎత్తులో

ప్రతిసారి

కష్టం వచ్చిన ప్రతిసారీ
ఆ చూపులు దీనంగా
నన్ను వెంటాడాయి
మోసపు మాటలు తీయగా
వినిపించిన ప్రతిసారీ
అనుబంధం నన్ను వెక్కిరించింది