కరెన్సీ బేరసారాల మధ్య
బంగారు తొడుగుల
'బంధం' కుదిరింది
ఆకాశమంత పందిరిలో
పుస్తెల 'తాడు' తో
కొత్త జీవితానికి ముడిపడింది
మేలెంచుతాం...
రెండు మనసులూ
మమేకమవుతాయని
కట్నపు కోర్కెలకు
అనుమానపు ముసుగు తొడిగినపుడు
మూణ్ణాళ్ళకే బంగారు బొమ్మ
మూగబోయినపుడు
సరిపెడతాం
కొత్త జీవితాలకు
ఇది మామూలేనని
పెనుభూతపు పైశాచికత్వంలో
ఆ అపరంజి బొమ్మ మాడి మసైపొతే ...
కంట తడి పెడతాం
నూరేళ్ళూ అపుడే నిండి పోయాయని
కానీ...
ఆ చితిమంట ప్రశ్నిస్తోంది
ఈ ఘోరానికి కారకులెవరు?
ఈ నేరాల్లో మీ వాటా ఎంత? ... అని
[పరువు ప్రతిష్టల పేరిట కన్నబిడ్డలను చేతులారా చంపుకుంటున్న తల్లిదండ్రులనుద్దేశించి]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి