12, ఏప్రిల్ 2010, సోమవారం

కష్టాలు

-->
మొన్న... కన్నీటి వరద
నిన్న... నీరింకిన బురద
నేడు... వ్యాధుల బెడద
కోలుకోని కష్టం... కృష్ణా తీరం

ఎడారి భూములు
ఎండిన గుండెలు
జలం లేదు... ఫలం లేదు
జనులు జీవచ్ఛవాలు
( మోడు ) బీటలు వారింది ' మెట్ట ' జీవితం
పెరిగి విరిగిన రెక్కలు

ఆవిరైన ఆశలు
అంతస్థుల వెక్కిరింతలు
భూ(మి)మ్ ని విడిచిన సాములో
"రియల్" కష్టాలు

విశ్వ విపణిలో
వ్యక్తిత్వం... రెక్కల కష్టం
"నిశి" రాతిరి కరెన్సీ వెలుగులు
కమ్మిన మాంద్యం మబ్బుల "ఐ.టి." తళుకులు

అవనిలో సగం...
అభద్రతే జీవితం
కుత్తుకలు కత్తిరించే
కత్తుల దారుల్లో
జీవితమొక రణం...
ఆత్మరక్షణలో ఆడబ్రతుకు

కష్టం లేని చోటు
కాగడా వేసి వెదికినా దొరకదు
నిరాశల ఉరితాళ్ళు, విషం డబ్బాలు
కావేవీ విషమ సమస్యకు పరిష్కారాలు

కాదు బ్రతుకు వృధా
కాకూడదు కన్నీటి వ్యధ
శోధించి సాధించడమే
ధీరగుణం అనలేదా మహాకవి...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి