17, మే 2015, ఆదివారం

పూపొదరిల్లు..

జనారణ్యంలో ఆ ఇల్లు
పూపొదరిల్లై శోభిస్తూనే ఉంటుంది..
తన ప్రేమికుల హృదయానందమై
ప్రకృతి పరవశిస్తూనే ఉంటుంది..
పచ్చని ఆ పొదరింట
తమ సొగసుకు తామే మురిసిపోతూ
రోజాలు రాగరంజితమౌతాయి..


జాజిమల్లి పరిమళాలను
రేరాణి గమ్మత్తుగా కవ్విస్తుంది..
వాటిని చిత్తు చేస్తూ సంపెంగ
మురిపెంగా నవ్వుతుంది..
వాటి మధ్య తమ అందాలను
గొప్పగా చాటుకుంటాయి కొత్త తరం పూబాలలు
వాటన్నిటినీ ప్రేమగా సాకుతూ
నీటి పాత్రతో ఆప్యాయంగా
తమను పిలిచే అమ్మను చూసి
కిచకిచమంటూ వచ్చి వాల్తాయి పక్షులు..
ఆ ముచ్చటకు మురిసిపోతూ
గెంతులు వేస్తాయి ఉడుతలు..
అక్కడే పూబాలలతో పరాచకాలాడుతూ
మకరందాన్ని గ్రోలి
ముచ్చటగా విన్యాసాలు చేస్తాయి సీతాకోకలు..
తమకూ గూడునిచ్చిన
ఆ పొదరింటి యజమానులకు
తీయగా ధన్యవాదాలు చెప్పి
తుట్టెను పెట్టుకుంటాయి తేనెటీగలు..


ఆ ఇంట పుష్పాలై
ప్రేమ ఫలిస్తూనే ఉంటుంది..
ఆ ఇంట నిత్య వసంతుడు కొలువై ఉంటాడు..
సప్తవర్ణ రాగాలు
తరంగాలై ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి..
పదుగురికోసం పరితపించే మనసులు
స్నేహపరిమళాలు వెదజల్లుతూనే ఉంటాయి..

అక్కడ వెన్నెలలు వర్షించడం
చందురుడికి ఎంతో ఇష్టం..
ఆ ఇంట ఒక్క రోజైనా గడపటం
మా ఇంటిల్లపాదికీ ఇష్టం..

-పద్మ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి